మూవీ న్యూస్

చిన్న సినిమాలకు చంద్రబాబు వరాలు, అది ఏంటో మీరు చూడండి

తెలుగునంది అమరావతి: తెలుగు సినిమా బడ్జెట్ పరిధి బాగా పెరిగింది. దీంతో చిన్న సినిమాలు ఆడించుకునేందుకు థియేటర్లు దొరక్క ఇబ్బంది కలుగుతోంది. చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది కాబట్టి, చిన్న సినిమాలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుంకట్టారు.

రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో… రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. అంతేకాదు పన్ను రాయితీతో పాటు చిన్న సినిమాల చిత్రీకరణకు లొకేషన్లను ఉచితంగా ఇవ్వనున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ వరకు ముందుగా చెల్లిస్తే, షూటింగ్ తర్వాత ఆ డబ్బును వెనక్కి ఇచ్చేస్తారు. ఉత్తమ కథాంశాలు, విలువలు ఉన్న 15 చిన్న సినిమాలకు రూ.10 లక్షల నజరానా అందించనుంది ఏపీ ప్రభుత్వం.

చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతుండగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.