మూవీ రివ్యూస్ రాజకీయం

అక్రమాలను నిరోధించే ఉద్దేశంతో ఎన్టీఆర్ శ్లాబ్ పధ్ధతిని ప్రవేశపెట్టారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రంగంలో శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికి ముందు ఎన్ని టికెట్లు అమ్మితే ఆ టికెట్ల సంఖ్యను బట్టి వినోదపు పన్ను కట్టేవారు థియేటర్ యజమానులు.

థియేటర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులలో అవినీతి కారణంగా ఇందులో అక్రమాలు జరిగి ప్రభుత్వానికి బాగా నష్టం వచ్చేది. ఇలాంటి అక్రమాలను నిరోధించే ఉద్దేశంతో ఎన్టీఆర్ శ్లాబ్ పధ్ధతిని ప్రవేశపెట్టారు. శ్లాబ్ పధ్ధతి అంటే ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటే ఆ సీట్ల సంఖ్యను బట్టి యాజమాన్యాలు ప్రభుత్వానికి పన్నుకట్టాలి. థియేటర్ నిండినా నిండక పోయినా పన్ను మాత్రం మారదు, ప్రభుత్వానికి సంబంధం లేదు.

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల సినిమాకు ఏమాత్రం జనాదరణ తగ్గినా వెంటనే తమ థియేటర్ల నుంచి తీసేసేవారు ఎగ్జిబిటర్లు. అందువల్ల ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పించే హాస్య ప్రధాన చిత్రాలకు ప్రాముఖ్యం పెరిగింది. శ్లాబ్ విధానం కేవలం పెద్ద సినిమాలకే మేలు చేసింది అన్న విమర్శలు ఉన్నా అవి నిజం కాదు. భారీ బడ్జెట్ తో రిస్క్ చేయడం ఎందుకనుకున్న నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు తీయసాగారు. ఎన్నో కొత్త కొత్త నిర్మాణ సంస్థలు పుట్టుకొచ్చి చిన్న చిత్రాలను నిర్మించేవారు. బడ్జెట్ తక్కువే కావడంతో కొద్ది రోజుల్లోనే వారి పెట్టుబడి వెనక్కు వచ్చేది. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి నూతన దర్శకులకు మార్కెట్ ఏర్పడింది.

ఎన్టీఆర్ 1994లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు నంబర్ 1, మాయలోడు, యమలీల, శుభలగ్నం వంటి చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి తారాపథంలో దూసుకుపోతున్నారు. ఆ ఏడాది జరిగిన ఓ సినీ వేడుకలో ఎన్టీఆర్ చేతులమీదుగా జ్ఞాపికను అందుకుంటున్న కృష్ణారెడ్డిని ఈ చిత్రంలో చూడొచ్చు.