రాజకీయం

పోలవరం ఫై ప్రధాని మోది ఘాటు వ్యాఖ్యలు..!

తెలుగునంది న్యూస్: పోలవరం నిర్మాణాన్ని తామే నిర్వహిస్తామంటే మేము కాదనలేదని, ఇప్పటివరకు రూ. 7 వేల కోట్లు ఇచ్చినా పోలవరం నిర్మాణాన్ని సరిగా ఎందుకు నిర్వహించలేకపోతోందని ఈ మధ్య ప్రధాని మోది ఒక వీడియో కాన్ఫెరెన్స్ లో ప్రశ్నించారు.

పోలవరం నిర్మాణ ఖర్చు రూ.57,940.86 కోట్లు కాగా గత డిసెంబర్ 15 వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10,069.66 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకూ చేసిన ఖర్చులోనే ఇంకా రూ.3,342.40 కోట్లు ఇవ్వాలి. గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా పోలవరం నిర్మాణాన్ని తొక్కి పెడుతూ మోదీ మాట్లాడిన మాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతలతోనే సమాధానం చెప్తోంది.

ఇప్పటికే దాదాపు 63 శాతం ప్రాజెక్టు పనులను పూర్తిచేసిన ప్రభుత్వం… పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు నమోదుకు సిద్ధమైంది. స్పిల్‌ఛానల్‌లో 24 గంటల్లో రికార్డుస్థాయిలో 28 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయనున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 9 నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ పని జరగనుంది. పనులను పరిశీలించడానికి జాతీయ, అంతర్జాతీయ మీడియాను పోలవరం తీసుకొస్తున్నారు. ఈ రికార్డును గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేయనున్నారు.

సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేసినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తర్వాత 13 జిల్లాల జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది, పది వేల మంది రైతులు పాల్గొనే బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు.

7,250 ఘ.మీ. కాంక్రీటు వేసి తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు దేశ రికార్డును సృష్టిస్తే ఈ మధ్యనే పోలవరం నిర్మాణంలో 24 గంటల్లో 11,153 ఘ.మీ.ల కాంక్రీటు వేసి దేశ రికార్డును అధిగమించింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రపంచ రికార్డు (చైనాలోని త్రీగార్జెస్‌ -13,000 ఘ.మీ.)ను అధిగమించే లక్ష్యంతో 24 గంటల్లో 28 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయనున్నారు.