రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

బ్రేకింగ్ న్యూస్.. ఏపీ సీఎం అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ..!

తెలుగునంది న్యూస్: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.ప్రధాన పోటీ మళ్లీ టీడీపీ,వైసీపీ మధ్యే కనిపిస్తున్నప్పటికీ ఎలాగైనా ఏపీలో పాగా వేయాలని కేంద్ర బీజేపీ భావిస్తోంది.అందులో భాగంగానే చంద్రబాబును దూరం నెడుతూ జనసేనకు దగ్గరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.ఇప్పటికే పవన్ యూటర్న్ తీసుకున్నారని బీజేపీతో పొత్తుకు లైన్ క్లియర్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు బీజేపీ ఓ బలమైన క్యాండిడేట్ ను రంగంలోకి దింపుతుంది.ఓ పక్క ఆపరేషన్ ద్రవిడ అంటూనే మరో పక్క రాజకీయంగా చంద్రబాబు,జగన్ లను దెబ్బతీసేందుకు కొత్త అస్త్రాన్ని దింపుతుంది.ఆ అస్త్రమే జేడీ లక్ష్మీనారాయణ.

ఈయన తెలియని తెలుగు వారుండరంటే అతిశయోక్తి లేదు.సీబీఐ జేడీగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడు.జగన్ అక్రమాస్తుల కేసుతో ఆయన దేశవ్యాప్తంగా సంచలనం గా మారారు.అయితే జేడీ లక్ష్మీనారాయణను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పటినుంచో పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ముఖ్యంగా లక్ష్మీనారాయణ కోసం బీజేపీ గట్టిగా పట్టు పడుతోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తోంది.ఈ విషయంపై ఇప్పటికే ఆయనతో పలుమార్లు చర్చలు చేపట్టారు బీజేపీ నేతలు.కానీ ఆయన తండ్రి రాజకీయాల్లోకి వెళ్లొద్దని సూచించడంతో ఇన్నాళ్లు ఆగుతూ వచ్చారు లక్ష్మీనారాయణ.


వాలంటరీ రిటైర్మెంట్ అందుకేనా..?

కానీ తాజాగా జేడీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బీజేపీ ఆఫర్ లో భాగంగానే రాజకీయాల్లో అడుగుపెట్టేందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే ఆయన అధికారికంగా కమలం కండవా కప్పుకుంటారని,వెంటనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్ అడిషనల్ డిజిపిగా సేవలు అందిస్తున్న జేడీ లక్ష్మీనారయణ తరుచుగా ఏపీలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ యువతకు దగ్గరయ్యేలా చూసుకుంటున్నారు.అయితే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఏపీ అభివృద్ధిపై బీజేపీ ఓ బ్లూ ఫ్రింట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీకి బీజేపీ ఏం చేసింది,తెలుగుదేశం ఏం చేసిందనే దానిపై వివరిస్తూనే టీడీపీ అవినీతిని బట్టబయలు చేసేలా తెరవెనక కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు..


ఇక జనసేన పార్టీని అంటిపెట్టుకుని జేడీ లక్ష్మీనారాయణను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా 2019 లో అధికారంలోకి రావచ్చని కేంద్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.జేడీ లక్ష్మీనారాయణకు యువతలో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంతో పాటు,ప్రత్యేక హోదాపై ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నందున ఖచ్ఛితంగా బీజేపీ గెలుస్తుందని నమ్ముతున్నారు కమల నాథులు.మరోవైపు ఏపీలో కులరాజకీయాలు చాలా ఎక్కువే కాబట్టి, జేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో ఓ బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగిస్తున్నందున బీసీ ఓట్లు సైతం బీజేపీకి పడతాయని భావిస్తున్నారు పార్టీ నేతలు.


మొత్తానికి ఆపరేషన్ ద్రవిడ అంటూనే, జేడీ లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేస్తున్నసన్నాహాలు అన్నీ అనుకున్నట్లుగా ఫలిస్తే కమలం ఖచ్ఛితంగా అధికారంలోకి వచ్చినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Add Comment

Click here to post a comment