మూవీ రివ్యూస్ రాజకీయం

మనదేశంలో ఉన్నవారే, మనకు సహకరించాల్సినవారే శత్రువులుగా మారుతున్నారు – బాలకృష్ణ

తెలుగునంది హిందూపురం: మనదేశంలో ఉన్నవారే, మనకు సహకరించాల్సినవారే శత్రువులుగా మారుతున్నారని… హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పరదేశీయుల కబంధహస్తాల నుంచి దేశాన్ని కాపాడిన గౌతమీపుత్ర శాతకర్ణి దెబ్బ కేంద్రానికి తెలియాలని, వారికి కనువిప్పు కలిగించాలని కోరారు. ఆదివారం అనంతపురం జిల్లా లేపాక్షి పెద్ద చెరువుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా హంద్రీనీవా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణా నీటితో పెన్నానదిని అనుసంధానిస్తామన్నారు. ఆనాడు తెలుగుగంగ ద్వారా రాష్ట్రానికే కాక చెన్నైకు నీటిని అందించిన అభినవ భగీరథుడు ఎన్టీఆర్‌ అని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతకు కృష్ణాజలాలను తీసుకొచ్చేందుకు భగీరథ యత్నం చేస్తున్నారని అన్నారు. త్వరలో మడకశిర వరకు నీటిని తీసుకెళతామని చెప్పారు. హంద్రీనీవా సృష్టికర్త ఎన్టీఆర్‌ అని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు రూ.54 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతిపక్షనేత జగన్‌ తమను లస్కర్‌ అంటున్నారని, గేట్లు ఎత్తే లస్కర్‌లే రూ.4,200 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.