మూవీ న్యూస్ రాజకీయం

శాసనసభ భవనం సెంట్రల్‌హాల్‌ లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు!

శాసనసభ భవనం సెంట్రల్‌హాల్‌ లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు.
నవ్యాంధ్ర రాజధానిలో అసెంబ్లీ భవనంపై ఏర్పాటు చేసే అద్దాలపై సూర్య కిరణాలు పడి సరిగ్గా 9.15ని॥ అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోని తెలుగుతల్లి విగ్రహం పాదాలను తాకుతాయని వీడియోలో వివరించారు. సూర్య కిరణాలు తెలుగు తల్లివిగ్రహాన్ని తాకగానే ‘మా తెలుగుతల్లికి’ పాట రావడం, విజువలైజేషన్‌ అన్నీ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి.

రామసేతువు నిర్మాణంలో ఉడత పాత్ర నాది: రాజమౌళి …..
అమరావతి ఆకృతుల రూపకల్పనలో పాలుపంచుకోవడం మీకెలా అనిపిస్తోందన్న విలేకరుల ప్రశ్నకు సినీదర్శకుడు రాజమౌళి స్పందిస్తూ…‘‘రామసేతువు నిర్మాణంలో వందలసంఖ్యలో వానరసైన్యం పాల్గొన్నా… వారందరి పేర్లూ ఎవరికీ తెలియవు. ఉడత పేరే అందరికీ తెలుస్తుంది. నా పరిస్థితి కూడా అదే…’’ అని పేర్కొన్నారు. అమరావతిపై తాను లఘుచిత్రం ఏదీ రూపొందించడం లేదని స్పష్టం చేశారు. ‘‘రాజధాని ఆకృతులకు నేను మూడుదశల్లో సలహాలు, సూచనలు అందజేశాను. తెలుగువారికి గర్వకారణంగా, నిరుపమానంగా, దిగ్గజ భవనంలా, భారతీయత ఉట్టిపడేలా, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సీఎం చెప్పడంతో నేను ఒక అధికారిక డాక్యుమెంట్‌ తయారుచేశాను. నాకు అందించిన చిత్రాల్లో తెలుగువారికి ఇంత గర్వపడే గొప్ప చరిత్ర ఉందా? అని సందర్శకులు ఆశ్చర్యపడేలా కొన్నింటిని ఎంపిక చేశాం. శాసనసభకు టవర్‌ ఆకృతిని ఎంపిక చేస్తే, ఈ చిత్రాలను మీడియా లేదా కల్చరల్‌ సిటీల్లో నిర్మించే భవనాలకు వినియోగిస్తారని అనుకుంటున్నాను. టవర్‌ ఆకృతికి నేను ఇచ్చిన సలహాలేమీ లేవు…’’ అని వివరించారు.