లైఫ్ స్టైల్

దేశర్‌ కధ దినపత్రిక రిజిస్ట్రేషన్‌ రద్దు – ఎన్‌ఏజె

తెలుగునంది న్యూస్: తమకు నచ్చని మీడియా సంస్ధలను బిజెపి పాలకులు ఏదో విధంగా దెబ్బతీస్తున్న చర్యలలో భాగంగానే త్రిపురలో దేశర్‌ కధ దినపత్రిక రిజిస్ట్రేషన్‌ రద్దు చేశారని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలపాలని నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(ఎన్‌ఏజె) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కె పాండే, ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష భావాలతో బెంగాలీ భాషలో అగర్తల నుంచి నడుస్తున్న ఆ పత్రిక రిజిస్ట్రేషన్‌ రద్దు చేయటంతో అక్టోబరు రెండవ తేదీ నుంచి ముద్రణ నిలిచిపోయింది. పత్రికలో ముద్రించిన సంపాదకుడు, ముద్రాపకుడి పేర్లకు ఆర్‌ఎన్‌ఐ వద్ద వున్న వివరాలకు సరిపోలటం లేదని వచ్చిన ఫిర్యాదుతో పాటు పత్రికలు, పుస్తకాల రిజిస్ట్రేషన్‌ చట్ట 1867ను వుల్లంఘించినట్లు తమ పరిశీలనలో తేలిందని జిల్లా కలెక్టర్‌ కొద్ది కాలం క్రితం మీడియాకు చెప్పారు. అనుమతి లేకుండా యాజమాన్య మార్పులు జరిగాయని, ఇతర కారణాలు చూపుతూ కలెక్టర్‌ పంపిన నివేదిక ఆధారంగా వార్తాపత్రికల రిజిస్ట్రార్‌ పత్రిక రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. నిజంగా అలాంటి లోపాలు వుంటే ఆ సాంకేతిక అంశాలను సరి చేసుకొనేందుకు గడువు ఇస్తూ హెచ్చరించవచ్చు. లేదా ఇతర చర్యలు తీసుకున్నా ఎవరూ అభ్యంతరపెట్టనవసరం లేదు కానీ ఏకంగా పత్రికనే మూసివేస్తూ సర్టిఫికెట్‌ రద్దు చేయటం ఖండించాల్సిన అంశమని ఎన్‌ఏజె పేర్కొన్నది.

కొద్ది వారాల క్రితం రైతుల ఆదాయాల పెరుగుదల గురించి కేంద్ర ప్రభుత్వ ప్రచార బండారాన్ని ఎండగడుతూ ఎబిపి న్యూస్‌ ఛానల్‌ వార్తను ప్రసారం చేసింది. దానిపౖౖె కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కంపెనీలపై వత్తిడి తెచ్చి వాణిజ్య ప్రకటనలను నిలివి వేయించారు. దాంతో యాజమాన్యం ఒక సంపాదకుడిని, యాంకర్‌ చేత బలవంతంగా రాజీనామా చేయించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి ఆదాయం గురించి వార్తలు ప్రచురించిన వైర్‌ వెబ్‌ పోర్టల్‌పై కూడా కేసు దాఖలు చేసి వేధిస్తున్న విషయం విదితమే. త్రిపుర రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ తీరు తెన్నులు, ఆ పార్టీ దాడులను వెల్లడించటంలో ముందున్న దేశర్‌ కధను దెబ్బతీసేందుకు సాంకేతిక అంశాలను సాకుగా తీసుకున్నట్లు కనిపిస్తున్నదని ఎన్‌ఏజె పేర్కొన్నది. ఇటువంటి చర్యలను యావత్‌ జర్నలిస్టు లోకం, ప్రజాతంత్రవాదులు పలు రూపాల్లో నిరసన తెలియచేయాలని, ఇందుకు రాష్ట్ర శాఖలు చొరవ తీసుకోవాలని ఎన్‌ఏజె కోరింది.

Add Comment

Click here to post a comment