రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

రాష్ట్రంలో బిజేపి అధ్యక్షుడిని మార్చాలని బిజేపి నిర్ణయించిందా?

తెలుగునంది అమరావతి: రాష్ట్రంలో బిజేపి అధ్యక్షుడిని మార్చాలని బిజేపి నిర్ణయించింది. ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు వారసుడు ఎవరన్న దానిపై కసరత్తు ప్రారంభించింది బీజేపీ అధిష్టానం. విదేశీ పర్యటనలో ఉన్న హరిబాబు వచ్చిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అధ్యక్ష రేసులో సోము వీర్రాజుతోపాటు, మాజీ మంత్రులు మాణిక్యాలరావు, కన్నాలక్ష్మీనారాయణ, ఆకుల సత్యన్నారాయణ పోటీ పడుతున్నారు. పురంధరేశ్వరీ పేరు కూడా వినిపిస్తోంది. సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించాలని భావించినప్పటికి మెజార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో మధ్యే మార్గంగా మాణిక్యాలరావు పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. గతంలో మాణిక్యాలరావు పలుమార్లు తనకు అధ్యక్షపదవి వద్దని ఆ పదవికి సరైన వ్యక్తి సోము వీర్రాజు అని ప్రతిపాదించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవి చేపట్టేందుకు మాణిక్యాలరావు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

అటు పార్లమెంటు సమావేశాల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని హస్తిన వర్గాలంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబుకు మంత్రిపదవి దక్కవచ్చని భావించినప్పటికి అవకాశాలు సన్నగిల్లాయి. అదే సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే పురంధరేశ్వరీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రాజ్యసభ సభ్యుడుగా ఎంపికయిన జి.వి.యల్. నరసింహారావుకు కూడా అమాత్యయోగం దక్కే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీపై ఇప్పటికే విమర్శలు దాడి పెంచారు.

ఓ సీనియర్ IPS అధికారి బిజేపి తీర్ధం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైందని బిజేపి వర్గాలంటున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయని వారంటున్నారు. అన్ని సవ్యంగా సాగితే మరికొద్దిరోజుల్లో ఆ అధికారి కాషాయ తీర్ధం పుచ్చుకుంటారనేది విశ్వసనీయ సమాచారం. అధ్యక్షుడి ఎంపిక, కేంద్రంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం పూర్తయ్యే లోగా మండల, బూత్ కమిటీ నాయకుల నియమకాన్ని పూర్తిచేయాలని రాంమాధవ్ అండ్ కో నిర్ణయించింది. ఏప్రిల్ 2వ వారంలో రాంమాధవ్ తోపాటు కేంద్రమంత్రి గడ్కరి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమాలు అయిన తరువాత రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయంపై పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బిజేపి నిర్ణయించింది. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారంతోపాటు కేంద్రమంత్రులు పర్యటనలు, టిడిపి ప్రభుత్వ అవినీతిపై విమర్శల వాడి పెంచనున్నారు. అవినీతిపై కోర్టులను ఆశ్రయించేందుకు కాషాయదళం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని బిజేపి నిర్ణయించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాలలో తన వ్యూహాలతో బిజేపిని పటిష్టం చేసిన రాంమాదవ్, ఇప్పుడు స్వంత రాష్ట్రంలో సత్తా చాటుకోవడానికి రెడీ అయ్యారు.

Add Comment

Click here to post a comment