వీడియోస్

తుంగభద్రకు ఆశల వరద

తెలుగునంది న్యూస్: తుంగభద్రకు ఆశల వరద !! జలాశయం నీటినిల్వలు 65 టీఎంసీల చేరే అవకాశం !! తుంగభద్ర ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, చిక్కమగళూరు ప్రాంతాల్లో శనివారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా వరుణుడు విజృంభించాడు. శృంగేరి వీధులు జలమయమయ్యాయి. అక్కడ సుమారు 147 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతం పక్కనే ఉన్న కిగ్గాలో 123, కెరెకట్టె ప్రాంతంలో 240 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గాజనూరు వద్ద ఉన్న తుంగా నది పూర్తిగా నిండింది (3.28 టీఎంసీలు). ఆదివారం కూడా సుమారు 34 వేల క్యూసెక్కుల వరద వచ్చి అందులో చేరుతుండగా, తుంగా నుంచి సుమారు 31,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 48 గంటల్లో ఆ వరద తుంగభద్రకు చేరుకునే అవకాశం ఉంది. ఇదే పరిమాణంలో వరద వచ్చి చేరితే రోజుకు కనీసం 3 టీఎంసీల దాకా నీటినిల్వ పెరిగే అవకాశం ఉంది. 13 వేల క్యూసెక్కులను ఓ టీఎంసీగా పరిగణిస్తారు. తుంగభద్ర జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 42.33 టీఎంసీల నీటినిల్వ ఉండగా, 8 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతోంది. తుంగా నుంచి విడుదలచేస్తున్న వరద ఇక్కడికి వచ్చి చేరితే జలాశయంలో నీటినిల్వ 45 టీఎంసీలకు చేరుకుంటుంది. శని, ఆదివారాల్లో కూడా శివమొగ్గ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసినందున గాజనూరులోని తుంగా జలాశయానికి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగా నుంచి దిగువకు విడుల చేస్తున్న వరద పరిమాణం వారం రోజులపాటు కొనసాగితే చాలు..జలాశయం నీటినిల్వలు 65 టీఎంసీల దాకా చేరుకునే అవకాశం ఉందని జలాశయం వర్గాలు భావిస్తున్నాయి.