వీడియోస్

భయపెడతున్న పెథాయ్‌ తుఫాను ..గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు

తెలుగునంది న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిల దృష్ట్యా రైతులను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ కె.ధనంజయ రెడ్డి వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు పి.డి.రత్నాకుమార్ ను శుక్ర వారం ఆదేశించారు. తుఫాను ప్రభావం వలన వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు, భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరికల నేపధ్యంలో రైతులకు పూర్తి సాంకేతిక సలహాలు అందించాలన్నారు. ఇప్పటికే అనేక చోట్ల వరి కోతలు పూర్తి చేసి కుప్పలు వేయకుండా ఉన్నారని వారు తక్షణం కుప్పలుగా వేసుకొనుటకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను క్షేత్ర స్ధాయికి పంపించి సమీక్షించాలని ఆదేశించారు. కోతలు పూర్తి చేయని వారు కోయకుండా చూడాలని, నూర్పులు చేయకుండా తగు సలహాలు అందించాలని అన్నారు. అవసరమైన చోట్ల టార్పాలిన్లు, పరదాలు కప్పుటకు తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను అవకాశం ఉంటే యంత్రాల సహాయంతో త్వరితగతిన కోసి నూర్పిడి పూర్తి చేయాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పిచికారీ తదితర అంశాలపై పూర్తి స్ధాయి సలహాలు అందించాలని ఆయన ఆదేశించారు.